న్యూఢిల్లీ: పార్టీ అగ్రనాయకత్వంపై కాంగ్రెస్ పార్టీ విమర్శల దాడి పెంచుతుండటంతో వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు బీజేపీ సిద్ధపడుతోంది. ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై విపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని, అయితే పార్లమెంటరీ నిబంధనలకు లోబడి వ్యవహరించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం ఉదయం జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో రాజ్‌నాథ్ మాట్లాడుతూ, ప్రధానిని 'చొరబాటుదారు'గా, దేశ ఆర్థిక మంత్రిని 'నిర్బల'గా విపక్షాలు సంబోధించినప్పుడు పార్టీ ఎంపీలు సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. విపక్షాల అబద్ధాలను తిప్పికొట్టాలన్నారు. అయితే ఏమి మాట్లాడినా సభామర్యాదను గుర్తుపెట్టుకోవాలని సభ్యులకు సూచించారు. 'సభ్యతాయుతమైన బాషను వాడాలనే విషయాన్ని మరిచిపోవద్దు. విపక్ష నేతలపై పరుష పదజాలం వాడవద్దు' అని రాజ్‌నాథ్ కోరారు. హాజరు తప్పనిసరి... ఎంపీలంతా పార్లమెంటు సమావేశాలకు విధిగా హాజరయ్యేలా చూసుకోవాలని, ముఖ్యంగా కీలక బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు, వాటిపై చర్చ జరిగే సమయాల్లో పూర్తి హాజరు అనివార్యమన్నారు. వచ్చే వారం పార్లమెంటు ఆమోదం కోసం కీలకమైన పౌరసత్వ సవరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశమున్నందున ఉభయసభల ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు. పార్లమెంటు లైబ్రరీ బిల్డింగ్‌లో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో హోం మంత్రి అమిత్‌షా, ప్రహ్లాద్ జోషి, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ దాడులను హుందాగా తిప్పికొట్టండి: రాజ్‌నాథ్